The courtyard of literature

అక్షర రథం

Poetry

సీతారామ విలాపం

తన సాంగత్యము నందు గల్గు సుఖ సంతోషావళుల్ నా మదిన్,
కనలేకుంటిని నేడు నేను, ఇక దైన్యంబందు లోలోతులన్,
మునిగే తీరును చూడుడింక, ఘన రాముండే గతిన్ తప్పె, మో
హన సీతా సతి రామచందురిని మాయన్ బాపు రాతున్నదా ?

ప్రేమా ఎంతటి ముప్పు తెచ్చితివె ? నా ప్రాణంబు అల్లాడగా,
రామానందము సీత కాదె? మరి దారేదీ తనన్ చేరగా?,
ఈ మాయన్ నను ముంచుటేమి సరదా ఈ కాల చక్రంబుకున్,
భామా రత్నము నన్ను చేరుటది నా భాగ్యాన రాతున్నదా?

నీలపు పుష్పరాశి జడనందున నుండగ చేతి వేళ్ళతో
లీలగ ఆటలాడ, కురులందున పువ్వులు జారి రాలగా,
కాలము మారిపోయినది కమ్మని చైత్రము సాగిపోవ సీ
తాలత పూలు రాల్చు చలి కాలము వచ్చెను చూడుడిప్పుడే

శివుడత్యంత సుఖంబుగా హిమమునన్ శ్రీగౌరి జోకొట్టగా
పవళించెన్, మరి రామచందురుని పాపంబేమిటో గాని, లో
కువ గట్టెన్ సురముఖ్యుడే, శివుడు నాకానందమౌ సీతనున్,
జవరాలన్ కరుణించి ఇచ్చుటిక నా జన్మాన రాతున్నదా?

కలయేమో ఇది? నీదు మాటలవి నా కర్ణంబులన్ వాలెనే,
కలతే నాకిక ఆ కలాగి , నిజమే కన్నీరు మున్నీరుగా
ఇల నాకున్ ఎదురైననప్పుడిక నాకీ బాధ చల్లారునా?
కలనే కాలము చెల్లిపోవుటది నాకా మంచి రాతున్నదా?

దురదృష్టంబను కారు చీకటలమే, ధైర్యంబు లేకుండెనే,
కరముల్ పాదములన్నియున్ వణకెనే, కన్నీరు వాగయ్యెనే ,
ఎరుగన్ కారణమెందుకీ కలత, నేనే పాపముల్ చేసె, నా
తరమానోర్వగ , నా కథందునిక, బాధే తీరు రాతున్నదా?

దంతంబుల్ బహు లాగుచున్నవి, మహా తాపంబు పోటెత్తెనే,
పంతం బూనిటు లేగుచుంటి నెచటన్ పోవంగ కానున్నదే,
చెంతం గన్పడనట్టి సీత కొరకున్ చిత్తంబులో క్రాగు చున్,
ఎంతంతోతిల భార మున్నదిది తగ్గేటట్టు రాతున్నదా?

ఉపవాసంబులె పంచభక్ష్యములహో.. ఉత్కృష్ట దుఃఖంబులే
తపనల్ దీర్చెడు రాగ మాలికలు గీతాలాపనల్ చూడుడీ,
అపకారంబది చేయలేదునెపుడున్, ఆనందమే పంచితిన్,
కృపచూపించడె దైవమీ వ్యథలు నాకున్ తప్పు రాతున్నదా?

ఆకాశంబును కూల్చగా వలయునో ? ఆవర్తనున్ చుట్టనో?
కీకారణ్యము కాల్చివేయు అనలున్ కన్నీట ముంచెత్తనో?
శోకాగ్నిన్ వరుణున్ దహింపవలెనో? శోషింపనో ధాత్రినిన్?
ఏకాకిన్, జగతిన్ జయింపవలెనో? ఏనేలగా సీతనున్.

నా సీతామహలక్ష్మినిన్ విమల దివ్యాక్షద్వయా శోభితన్
చూసేదెప్పుడు కన్నులార మిథిలా చిన్నారినిన్ జానకిన్
ఆ సీతన్ గని నాదు బాధ తొలగన్ ఆనందముప్పొంగగన్
హా సీతా! అని నేను ఏడ్చుటది ఆగాలన్న రాతున్నదా?

— work in progress —

సీతారామ కేళి

1సీతను చూచుచున్న దివిసీమల తేలెడి మానసంబుతో
వాతము తాకినట్లు తనువంతయు నిండెడి తన్మయంబులో
గీతము పాడుచూ మనసు గంతులు వేయగ గౌతమీనదీ
వింతను చూడ, రాముడిక వీడడు జానకి చీరకొంగునే.

2ఆకలి నీకు లేదనిక, ఆగ్రహమూ ఉపవాసముండునా?
వేకువ నుండి రాత్రివరకేమి విరామము నియ్య జాలవా?
నీకిది భావ్యమా ఇటుల నీవిపుడన్నము మానివేయగా
నాకును ఆకలుండదిక నాప్రియ సుందరి! అల్క మానవే

3నిను గనినంత నాక్షణమునే మటుమాయము నాదు బాధలే,
నను గనవేమి? నాయెడల నెందులకా అలుకేమి చేయుటో?
విను మిది నువ్వు చెప్పినదె వేదము, నీ కర మేది గీయునో
విను మదె గీత, దాటనుగ, వేదన బాపుచు మాటలాడుమా!

— work in progress —

సీతారామ పట్టాభిషేకం

వనవాసమందు రామ విభుని నీడ
స్వర్ణలంకను కాల్చె సాధ్వి లలామ ①
అమవాస్య దాటిన అపరంజి భామ
శుక్లపక్షపు చంద్ర జాజ్వల్య దీప ②
తన గుణంబుల తోడ తనవారి కెల్ల
సత్కీర్తి తెచ్చిన సాకేత రత్న ③
జనక రాజేంద్రుని జన్మ సార్థకము
దశరథ రాజుకు తన వంశ కీర్తి④
శ్రీ రామచంద్రుని సగభాగమైన
మాన్యచరిత సీత మహలక్ష్మి సీత ⑤
ఆ సీత తోడుగా అనుజుని తోడ
విచ్చేసె రాముడు వాల్మీకి కడకు ⑥
పదునాల్గు ఏడుల పూర్వపు కథలు
వాల్మీకి మదిలోన వాగయ్యె నపుడు ⑦

అశ్వమేధము చేసి అమలుడైన పిదప
పుత్రకామేష్టి వల్ల పొందినట్టి
సాకేత నగరము సంతోషమొందగా
సకల విద్యలయందు శూరులైన
ప్రాణ సమానులౌ పుత్రుల యందున
పెద్ద వాడిని గాధి పుత్రుడడుగ
శ్రీ వశిష్టుడు చెప్ప శ్రీరామ చంద్రుని
దారుణాటవి కంపె దశరథుండు ⑧

అండ దండ గాగ అన్నకు తమ్ముడు
లక్ష్మణుండు సుగుణ లక్షితుండు,
తీర మడగకుండ ధీర విశ్వామిత్ర
బాట నడిచె రామ బాలకుండు. ⑨

— work in progress —

గురుదేవ శతకం

1విద్య కలిగెనేని వినయంబు ధైర్యంబు
భూత దయయు కల్గు, భూమిపైన
విద్య లేని యెడల విలువ లేకుండును,
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

2ధర్మమన్నది కడు ధైర్యవంతుల సొత్తు
ధర్మమన్నది బహు దైవికంబు,
ధర్మమన్నది గొప్ప తారకంబే కదా!
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

3కలుగు సుఖము భువిన కర్తవ్య నిష్ఠచే
కలుగు కీర్తి కలుగు గౌరవంబు
కలుగునయ్య సఖులు కలుగు దైవత్వము
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

4స్త్రీల రక్షణంబు శ్వాసగా కలుగుట
భావ్యమయ్య మనకు భూమిపైన
పడతి పట్ల భక్తి పరమేశ్వరుని భక్తి
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

5గురుని మీద భక్తి గౌరవంబులు ఉన్న
కలుగునయ్య సర్వ కార్య సిద్ధి
గురుని పట్ల భక్తి గుణముల గణమేగ
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

6వీర్యవంతుడైన వీరాధివీరుని
ఎదుట నిలువలేరు ఎవ్వరైన,
మనిషి అన్నవాని ముఖ్యలక్షణమిది
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

7ధర్మ పాలనంబె దైత్యులన్ దునుమాడు
ధర్మ పాలనమ్మె ధరను నిల్పు
ధర్మ నాశనంబు దనుజ వీర్యదమౌను
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

8మనకు మంచి చేయు మానవోత్తములను
భూమి నిల్చు దాక భూమి మీద
మనము నిల్చు దాక మనమునుంచవలెను
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

9ప్రియము మాటలాడు ప్రేమాత్ము పలుకులు
సత్యము ధరియించు సాత్వికునవి
వాక్కులన్ని సత్య వాక్కులు నిజమయ్య
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

10పట్టు పట్టవలెను పుణ్యకార్యములందు
మంచి పట్టు పట్టి మహిమతోడ
సర్వకార్యములను సాధించవలెనయ్య
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

11మనిషి ఏమిటన్న మాట వచ్చినపుడు
నడవడి తెలియంగ నిజము తెలియు
నరుడు చావవచ్చు నడవడి చావదు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

12మంచి ఉన్నవాడె మనిషి అన్నయతడు
సర్వభూతములకు సఖుడు ప్రియుడు
స్నేహ పూరితమగు శీలవంతుడతడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

13యం విదన్న విద్య అన్నిటా శ్రేష్ఠము
ధారణంబు జన్మ తారకంబు
గురుని వలన భువిన కలుగు విద్యే విద్య
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

14చదువుకున్నవాడు చేయకున్ననపుడు
చదవకున్ననేమి? చదువనేమి?
చదువుకున్నవాడు చేసిచూపవలెను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

15చూచినంత మరల చూడవలెను అహో!
చూచు వాని చూపె చూపు నిజము
అన్న రూపు రూపు అద్భుతమౌ రూపు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

16ధైర్యమన్న మిగుల దీక్షతో వచ్చును
సత్యధర్మ యుక్త శీలమునకు
అట్టి ధైర్యమిపుడు అవసరంబు మనకు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

17క్రోధమన్నది కడు కష్టదాయకమౌను
క్రోధమున్న విద్య కల్లయగును
క్రోధమన్న జీవ కళ్యాణ విఘ్నము
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

18విద్యవలన మంచి విలువలు వలనను
నడక వలన మంచి నేర్పు వలన
కలుగునయ్య మనకు గొప్ప ప్రకాశము
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

19మనిషికుండరాదు మాత్సర్య భావము
ఉండెనేని మంచి ఉండబోదు
దారుణంబులందు దారుణమైనది
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

20నయము మీర చెప్పి నష్టపోవుట కంటె
భయము పెట్టి బాగు పడుట మేలు
కొంత కోపమున్న కళ్యాణమగునులే!
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

21ఉన్నవాడు ఐన ఉత్తుత్తివాడైన
మనిషి అన్నవాడె మానవుండె
సామ్యవాదమిలన స్థాపించవలెనయ్య
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

22ధనము ఉన్ననేమి? దారిద్ర్యమంతయూ
మనసులోన దాచె మానవుండు
ధనము కన్న మనకు ధర్మమే ముఖ్యము
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

23భూమిని గనినట్టు భూమిపుత్రుని చూడు
గౌరవంబు, ప్రేమ కాస్త చూపు
మనకు బువ్వ పెట్టు మహితాత్ముడతడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

24భక్తి ఉండవలెను బలము ఉండవలెను
భక్తి వల్ల కలుగు బుద్ధి మనకు,
పుడమిన పనులన్ని బలముతో జరుగును
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

25కొండ మీది రాయి, కలుగులోని ఎలుక
తీరమందు ఇసుక తమల పాకు
వీటి కన్న చూడ వీగిపోయె నరుడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

26స్త్రీల సిరుల వెంట శీలవంతులు పోరు
శీలవంతుల వదిలి సిరులు పోవు
సిరులు శీలమున్న స్త్రీలు వదలబోరు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

27ఇసుక యందు మనకు ఇబ్బంది యైననూ
పరుగు పెట్టవలెను పట్టు పట్టి
నూనె పైన నడక నయమైన భయమేగ
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

28దేశభక్తి లేని దౌర్భాగ్యుడుండిన
ఫలితమేమి? మనకు పుడమి పైన
పుట్టెనేని దేశ భక్తి ఉండవలెను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

29భాష యందు భక్తి భావమందనురక్తి
లేనివాడు మనసు లేనివాడె
పాము కన్న ఖలుడు పాపాత్ముడాతడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

30స్వేచ్ఛ వలన మనము శాంతి పొందగవచ్చు
స్వేచ్ఛ వలన కలుగు సుఖము నిజము
స్వేచ్ఛ వలన కలుగు శోషణంబైననూ
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

31చదువ వచ్చు గాక చేట భారతముల
చదివెనేని చదువు చదివినట్టె?
మర్మ భేదమయ్య ముఖ్యమ్ము చదువులో
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

32సాటి మనిషి పట్ల సానుభూతి ప్రేమ
చూప లేని వాడు చచ్చినంత
పోవుదేమి లేదు పృథ్వి భారము తప్ప
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

33తప్పు చేయువాడు తప్పించుకొనువాడు
తోట వారి తోడు తప్పు వాడు
తన్ను తెలియలేడు తరియింప గాలేడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

34తప్పులెన్నకున్న తప్పుదిద్దుటెటుల?
తప్పులెన్నుటేమి తప్పు కాదు
తప్పు మీద తప్పు తప్పకున్నను తప్పు
ధర్మతేజమ! గురుదేవ! దేవ! ㊞

35గతము తవ్వుకొనుచు గొప్పకు పోరాదు
గతము మరిచెనేని గడువ బోదు
గతము కన్న నేడు గొప్పగానుండాలి
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

36పరుల మాటలు విని బాధపడని వాడు
పరుల నెన్నడనడు పగకుపోడు
పొంగిపోని వాడు పరమ ధర్మాత్ముడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

37పరులకుపకరంబు ప్రియభాషణంబుయు
దానగుణమభేద ధర్మ బుద్ధి
న్యూనతాది భావ నియమాలు దయలయ్య
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

38అల్పసంతోషంబు ఆనంద మానసం
నిర్భయత్వము కడు నియమ వృత్తి
మౌనమాత్మ తృప్తి మనిషికి శాంతియౌ
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

39తృప్తి కలిగెనేని తీయని మనసుండు
తృప్తి లేని మనసు తరిచి చూడ
కారమన్నము తిను కుక్కనోటి సమము
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

40చిన్న తప్పులైన చేదు భయములౌను
తప్పు చేయనొకడు ధరన లేడు
తప్పు దిద్దుకొనుట ధర్మవంతుల దారి
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

41ఏమి ఇచ్చుననుచు ఏమరపాటుతో
విడువ రాదు మనము విహిత కర్మ
విత్తనంబె రేపు వృక్షరాజమగును
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

42మనసు నిగ్రహించి మౌనమ్ము పాటించి
కోర్కెలతను తెంచి కర్మచేసి
పరుల లాభమందు పొందాలి తృప్తిని
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

43శౌర్యతేజ ధృతులు శాంతిదానములును
పారిపోని గుణము పరుల సేవ
వృత్తి పాలనమ్ము వీరలక్షణములు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

44మనము చేయు పనిని మెండుగా ప్రేమించి
నియతి తప్పకుండ నేర్పు పొంది
ధనము పొంది ధర్మదానాలు చేయాలి
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

45అహము పొందరాదు, అతియు చేయగరాదు
భయము పొందరాదు, బాధ వలదు
ధర్మ రక్షణందు దయను చూపగరాదు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

46మంట మీదకురుకు మిణుగురు పురుగులా
తెలిసి చేయరాదు తప్పు , తప్పు
లోభకామములకు కరిగిపోరాదయ్య
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

47ఆనందమేమని ఆదిత్యుడడగడు
లాభమేమి అనవు లతలు చెట్లు
విహిత కర్మమెపుడు విహిత కర్మేనయ్య!
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

48కోరి చేయరాదు కర్మ వదలరాదు
కోరికేమి లేని కర్మ గొప్ప
వచ్చుదెప్పుడైన వచ్చియే తీరును
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

49పరుల నిందలన్ని పొడవాటినిచ్చెనౌ
పరుల మెచ్చుకోలు పాములౌను
పరుల సేవ మనకపర సురలోకమౌ
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

50ధర్మరక్షణంబు దైవభక్తి సమము
సత్యపాలనంబు శాంతి సమము
పరుల సేవనంబు పరమసంతోషమౌ
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

51రామమైత్రి వల్ల రవిజుడు రాజయ్యె
అసుర సఖుడు వాలి అంతమయ్యె
ధర్మవర్తనమ్మె ధరలోన నెగ్గును
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

52కోప వర్తనంబు కక్షలూ పగలింక
అమిత భోజనంబు అనిజ బుద్ధి
ఎన్ని ఉన్న నిలిచె, ఏల? ధర్ముని వాడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

53కొద్దిపాటి అహము, కొండంత తేజము
కీర్తి దాహమున్న కృష్ణ విభుడు
ధర్మ రాజు వలన ధరలోన వెలిగెను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

54విద్య ఉన్ననేమి? వినయమ్ము లేదుగా
తపము చేయనేమి? తృప్తి లేదు
రావణుడిని వాడి రక్తియే చంపెను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

55ఎరుక ఉన్న ఏమి? ఏమి చేసెను వాడు?
రక్తి చోదితుడగు రాజ రాజు
దుష్ట అహము వలన ధరలోన కలిసెను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

56కష్ట పడిన గాని కర్మవదలలేదు
ధృతిని వీడలేదు, ధర్మ సుతుని
తోడు వీడలేదు ధర్మమనుచు కృష్ణ
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

57చేయ దగిన పనులు జాప్యమ్ము చేయక
పూర్తి చేయవలెను పట్టుపట్టి
నిన్న రేపులెపుడు నేటికి సరియౌనె?
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

58స్వార్థ వర్జితుండు సుగుణ సంపన్నుడు
విద్య ఉన్నవాడు వినయ విధులు
తెలిసి ఉన్నవాడు తెలియజేయగలడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

59వినయమున్నవాడు వినుట వచ్చినవాడు
ధర్మ బుద్ధి వాడు, ధృతిని కలిగి
ఆచరించు వాడు అసమాన శిష్యుడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

60తనకు నచ్చు దాన్ని తెలియ గోరెడి వాడు
తనకు నచ్చు దాన్ని తెలుపు వాడు
సగము బుద్ధి వాడు శుష్క ప్రసంగియౌ
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

61నదులు చేరినంత నయము తప్పదయ్య
సాగరంబు ఎపుడు , సత్యమయ్య
గొప్పదయ్య దాని గాంభీర్య సంపద
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

62ధర్మ హాని కలుగ దైవమక్కరలేదు
మనము చాలు దాన్ని మరల నిలుప
ధర్మ రక్షణమ్మె దైవత్వసంపద
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

63ప్రియము కలిగెనేని పొంగని మనుజుండు
ప్రియము కలుగకున్న పడనివాడు
దేనినైన గెలుచు ధర్మమార్గంబున
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

64ఆర్తులైనవారు అర్థార్థులగువారు
బుద్ధి కోరువారు పండితులును
విద్య కోరునయ్య విద్యయే దైవము
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

65సర్వకాలములను స్థిరబుద్ధి నిలుపుచు
ధైర్య యుక్తులగుచు ధర్మమందు
సాగిపోయిరేని సౌఖ్యము ప్రాప్తించు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

66ఆటపాటలవని అల్లర్లు చేయుచూ
బాల్యమంత గడిపి బుద్ధి లేక,
ఏడ్చినంత ఇపుడు ఏమి లాభముకల్గు?
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

67యవ్వనంబులోన ఆడువారి వెనుక
రెచ్చిపోవుచు కడు రచ్చ చేసి
ఉన్నకాలమంత ఊరకే గడపరే?
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

68మధ్య వయసులోన మనసు డబ్బును కోరు
మమత మరచునయ్య మనుషులపుడు
ఉన్నకాలమంత ఉద్యోగముకు పోవు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

69అంత్యకాలమందు అయ్యహో అనినంత
తరిగిన సమయంబు తిరిగి రాదు
దీపముండగ సరి దిద్దుకొనుట మేలు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

70తోడు వచ్చె నెవడు ధరకు వచ్చిననాడు
వెంట వచ్చునెవడు వెళ్ళు నాడు
నీదు ధర్మమయ్య నీకు తోడుండేది
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

71నమ్మకముల లోన నరుడి మూలములుండు
నమ్మకంబు లేక నరుడు లేడు
నిజములందునెపుడు విశ్వాసముంచాలి
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

72విద్యరక్షణమ్ము వైవిధ్య రక్షణం
ముఖ్య ఆశయముగ మత్స్య మూర్తి
అవతరించెనింక ఆశయం సాధించె
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

73కష్టమన్న చాలు కష్టమే కష్టమ్ము
కష్టపడని యెడల కలుగునేమి?
కష్టమును భరించె కూర్మమై విష్ణువు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

74స్త్రీల మోహమున్న చీకటే మిగలును
మోహినీ లతాంగి మాయలోన
పడ్డవాడు నేల పడ్డవాడయ్యెను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

75లోభగుణము వలన లాభమేముండును?
కశ్యపాత్మజుండు కడనవాడు
విగత జీవుడయ్యె శ్రీవరాహము వల్ల
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

76సాధు పురుషులందు సన్మార్గ గతులందు
దోష బుద్ధి గలిగధర్మములను
చేసినంత సమసె సింహముఖుని చేత
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

77అణువు అంతవాడు ఆద్యంతమయ్యెను
వామనుండు బుజ్జి వటువు బుడుగు
మనిషి తలచుకున్న మహిలోన గగనమౌ
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

78కులపు ధనపు బలపు గర్వాలు చెలరేగ
భూమి సర్వము రణభూమి కాగ
భార్గవుండు చేసె భూభారమోచనం
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

79సర్వశాస్త్రములన సంపూర్ణ విజ్ఞాని
దైవసముడు సత్య ధర్మమూర్తి
శ్రీయుతుండు, మహిన శ్రీరామచంద్రుడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

80ధర్మమందధర్మ తత్త్వాలు చూపుచూ
ధర్మసూక్ష్మములను, ధర్మములను
వేరు వేరు చేసె వైకుంఠకృష్ణుండు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

81పాప పుణ్యములని పట్టి వదలబోవు
మనము వాటిని మన మనమునందు
దాచుకొందుమయ్య ధరకు బంధీలమై
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

82పరుల కొరకు జన్మ పొందినామన్నది
పరమ నిజము నిజము పరమ నిజము
పుణ్యపాపములది పాటించడంబట్టి
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

83వినయమున్న కలుగు వినెడి లక్షణమది
ఉండకున్న కలుగు ఉర్విలోన,
దారుణములు పెక్కు, ధర్మనాశనమౌను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

84వయసు ఉన్ననేమి విద్యలేకుండిన?
వయసుతోటి రాదు విద్య నిజము
పెద్దరికము నిచ్చు పిన్నలకును విద్య
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

85అన్ని వేళలందు ఆవేశ పడరాదు
కొన్ని వేళలందు ఓర్మి తగదు
సమయమే తెలుపును సత్యధర్మములును
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

86పరులకుపకరించు పలువిద్యలన్నియూ
నేర్వవలెను నేర్చి నేర్పవలెను
విద్యవలన పుట్టు విమలాశయంబులు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

87అల్ప ధర్మమైన ఆనందమిచ్చును
దుష్ట మల్పమైన దురితమిచ్చు
అల్పదానమైన అక్షయమౌనుగా
ధర్మ తేజమ! గురుదేవ! దేవ!

88ప్రశ్నలందు మనము పరిపక్వతను జెంది
సంఘ సేవ కొరకు సరిది యైన
ప్రశ్న వేసినంత పౌరులుద్యమమౌను
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

89వినయవంతుడొకడి విద్యచాలును మంచి
మార్పు తెచ్చి దివిని మహినికలుపు
వినయహీనుడొకడు వీటన్నిటిని కూల్చు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

90కన్నవాళ్ళ కన్న కడు గొప్ప వాడయ్య
విద్య నేర్పు గురువు విమలుడతడు
గురువు లేని వాడు గుడ్డివాడేనయ్య
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

91వెంట రావు సిరులు విద్యలూ బలగమూ
వెంట రాని వాటి వెంట యేల?
సుఖము సమత లేని స్వార్థబుద్ధి విషమ్ము
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

92ధనము లేని యెడల ధరలోన పనులకు
వ్యవధి పట్టుచుండు వేదనుండు
ధనము కలిగెనేని ధర్మమ్ము నిలుచును
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

93లీల ఉండవలెను లవలేశమైననూ
లీల లేని యెడల వీలు లేదు
లీల నిలుపు అవలీలగా ధర్మాన్ని
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

94జ్ఞానవంతులైన జనులు తోడుండగా
కాని పనులు ఎచట కాన రావు
జనులు కలిగెనేని సాధ్యపడును మార్పు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

95బలము లేనివాడు బుద్ధితక్కువ వాడు
జనము లేని వాడశాంతి సఖుడు
ఉండి లాభమేమి ఉర్విలో రాయిలా
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

96అద్దమందు కొండ అమరినట్టు విధాన
ధర్మమందు జగతి దాగియుండు
ధర్మమన్న నింగి ధరణి కాచుచుండు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

97అర్థమందు ఇముడు ఆత్మబలములింక
జనపు బలము ధర్మ సత్య బలము
విద్య బలములింక వివిధముమౌ సుఖములు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

98ధర్మవర్తనమను దారిలో కోర్కెలు
తీర్చుకొనుచునుండు ధర్మపరులు
కామ్యలతలు కోసి కర్మచేయుట మేలు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

99కర్మ చేయుటందు కలదధికారమ్ము
కర్మ ఫలములందు కాదు కాదు
త్యాగ బుద్ధివల్ల దరిచేరు మోక్షమ్ము
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

100ధర్మమందు తిరుగు, సత్యమే భాషించు
తర్కబుద్ధి కలుగు, దయయు గల్గి
మహిన శాంతి నిల్పు మనుజుడే మనుజుడు
ధర్మతేజమ! గురుదేవ! దేవ!

విమల పినాకిని వీచిక

పల్లవివిమల పినాకిని వీచిక
అమలజ భాసల హారిక

చరణం 1శైలమె శేషుడు శైలమె తల్పము
అలరెడు రంగని అంగణము
పిలువగ పలుకును పిల్లన గ్రోవది
చాలద గీతా సారము
॥ విమల ॥

చరణం 2వెన్నను మరిగిన వెన్నుని జిహ్వకు
తిన్నగ గారెలు తినుటకును
పెన్నను తెచ్చెను బెరుకుగ భూసతి
పన్నగ శయనుని పాటుకు
॥ విమల ॥

చరణం 3యవ్వన కాంతల హాసల భాసల
దివ్వెల మధ్యన తిరుగుచును
పువ్వులు చల్లగ మురిపెమునింతులు
నవ్వుచు రంగడు నాడెను
॥ విమల ॥

చరణం 4నాగేశానిల నాద వినోదము
వాగీశాచ్యుత వరముగను
రాగాలాపన రక్తిగ చేయరె
వేగమె చూడుడి వెన్నుని
॥ విమల ॥

Meaning

Pallavi — A ripple of the clear Penna river — pure-born, glowing, captivating.

Charanam 1 — The hill itself is Shesha, the hill itself is his bed — this is Ranganatha's blooming courtyard. Call out to him, and it is the flute that answers — and that sound alone is the essence of the Gita. Is that not enough?

Charanam 2 — For Vishnu's tongue, long used to stolen butter, eating spicy garelu straight is no easy thing — so Mother Earth, all flustered, brought the Penna river itself, for the trouble of the one who rests on the serpent.

Charanam 3 — The radiant smiles of the young women are themselves the lamps he moves among — as they scatter flowers in delight, Ranga dances, laughing.

Charanam 4 — Take the play of music of the wind that is Nagesha — hold it, for yourselves, as the unfailing boon of the Lord of the Word — sing the rāga with full feeling — and quickly, behold Vishnu!

ఏల వచ్చితివయ్య

పల్లవి 1 (సత్యభామ)ఏల వచ్చితివయ్య శ్రీ జగన్నాథుడా? ఈ దారి జ్ఞప్తికిని గలదటయ్య?
కోలాహలంబంత గడచిపోవగ నీవు కోమలాంగిని జూడ కదిలినావ?
కృష్ణయ్య! కృష్ణయ్య!

పల్లవి 2 (కృష్ణ)ప్రియురాల! మనసంత నీతలపె నిండెనే, ప్రియముగను కౌగిటను చేరనివ్వె,
అయుతముగ ప్రేమించు నిజనాథు వంకిటుల అలుగుటది న్యాయమా సత్యభామ!
ప్రియురాల! అలుకేల

చరణం 1 (సత్యభామ)నియతి తప్పితివయ్య నమ్ముమో శ్రీకృష్ణ! నిజసతిని విడనాడి వెడలినపుడు
నయనద్వయంబులో నీ రథమె నిండగా నగరవాసులు నన్ను మరచిరయ్య!
కృష్ణయ్య! కృష్ణయ్య! (1)

చరణం 2 (సత్యభామ)ఫలహారములు పెట్ట గోపకాంతలు నీకు భామగలదన్నదే మరచినావు
బలదేవు తోడ మీ చెల్లి తోడను నీవు బంగారు రథముపై తిరిగినావు
కృష్ణయ్య! కృష్ణయ్య! (2)

చరణం 3 (కృష్ణ)ఒక్కదానవె నీవు శోభింతువెప్పుడూ, ఒరులు నీ ప్రక్కగా మెరువగలరె?
ఎక్కిరా రథము మును అన్నయూ చెల్లియూ, ఎక్కనా రథము నిను పిలువగలనె?
ప్రియురాల! అలుకేల (3)

చరణం 4 (సత్యభామ)తాళ ధ్వజంబింక దర్పదలనంబింక తమరికా గరుడ ధ్వజంబుగాగ
కేళి సలుపగ జనులు మూడు రథములపైన, కిమ్మనక తమరచట కదలలేదె?
కృష్ణయ్య! కృష్ణయ్య! (4)

చరణం 5 (కృష్ణ)శ్రీక్షేత్రమొక్కటే రథయాత్ర చేయునా? శ్రీనాథుడంతటా గలడె భామ!
ఆక్షేపములు మాని వీక్షించి భక్తులను అలుక మానవె భామ! సత్యభామ!
ప్రియురాల! అలుకేల (5)

చరణం 6 (కృష్ణ)అడుగ గలమా భామ! రథ సంఖ్య భక్తులను? అచటొక్క రథమున్న నెక్కవలయు,
కడు వేడుకగ వారు చేయు యాత్రను జూచి కరుణజూపుము భామ! సత్యభామ!
ప్రియురాల! అలుకేల (6)

చరణం 7 (సత్యభామ)దామమో ఆ యతుల చేలమో మాలయో దామోదరా నీవు అవగరాదె
అమరియుందువు గాదె వారి గుప్పిళ్లలో అందముగ, భక్తి యదె అబ్జనాభ!
కృష్ణయ్య! కృష్ణయ్య! (7)

చరణం 8 (సత్యభామ)మనసు నిను పట్టునో పట్టదో గోపాల, మంచిగా పట్టుదురు వస్తువులను
తినగ ప్రసాదంబు తనువు మరచెదరయ్య తీపేమొ నీకన్న తెలుసుకోవె?
కృష్ణయ్య! కృష్ణయ్య! (8)

చరణం 9 (కృష్ణ)దామమందేడపుడు అడుగు వేసేడపుడు దర్శించునపుడారగించునపుడు
కోమలాంగీ నన్ను జైజగన్నాథయని కోరి పిలుచుదురమ్మ చూడవమ్మ
ప్రియురాల! అలుకేల (9)

చరణం 10 (కృష్ణ)లోక మాతవు గాదె? భూయంశ గావటే? లోన ఓర్పుంచవే ఊరుకోవె
సుకుమారవతి నీకు తగదె కోపము చూడు సుతులెల్ల కంపింతురాలకించు
ప్రియురాల! అలుకేల (10)

చరణం 11 (కృష్ణ)నీకతుల ప్రీతియని పూత రేకులు తేవ నీ నాథుడేగెనిక చల్లబడవె
మకుటంబె చిరునవ్వు నీ వదన శోభలకు మన్నించి నన్నింక ఏలుకోవె
ప్రియురాల! అలుకేల (11)

చరణం 12 (సత్యభామ)మాట కారివి గాదె మాయ గోపాలుడా! మదన మోహన! కృష్ణ! సత్యాపతి!
ఇట రమ్ము పెట్టెదను చేతులారగ నీకు ఇష్టమౌ పూతరేకులను నాథ!
కృష్ణయ్య! కృష్ణయ్య! (12)

చరణం 13 (సత్యభామ)ఎచటకేగిన గాని వదిలి పోకుము నన్ను, ఎగతాళి కాదయ్య ప్రేమకపుడు?
అచలమందున్న ఆ నాగేశు సాక్షిగను హంసగమనుని సాక్షి మాట ఇమ్ము
కృష్ణయ్య! కృష్ణయ్య! (13)

చరణం 14 (కృష్ణ)రెండు రూపములైననొక్క ఆత్మగ మనము రెండు పేర్లైననొక భావముగను
నిండుగా వెలిగెదము ఎల్ల వేళల మనము నిజమిదియె నిశ్చయము నన్ను నమ్ము
ప్రియురాల! ప్రియురాల! (14)

స్వామినాథుడతడే

పల్లవి (శివుడు)రమణీ! నీ సుతుకై షణ్ముఖుకై గుహుకై రారే కట్టుమలై సుజ్ఞానంబునకై
హిమజా! గరువంబే మది కమ్మే అరెరే! యింపుగ తను వివరింపగ ఓంకారమునే
॥ స్వామినాథుడతడే స్వామినాథుడతడే ॥

చరణం 1యుగములు తపమొనరించెడి ఋషులకునైనన్ యోగులు దేవేంద్రుడు వాణీశునకైనన్
జగమున గల వారల యందొక్కరికైనన్ శక్యమె ఈ రీతిగ ఓంకారము తెలుపన్
॥ స్వామినాథుడతడే స్వామినాథుడతడే ॥ (1)

చరణం 2తిలకింపుము, తండ్రులు తమ తనయల తోడన్ దేవీ! ఆ అరువది మెట్లారోహింపన్
విలసిల్లెడి మన సుతునా మురుగని గొలువన్ వేడుక వేరుండునె మరి మా మదికింకన్
॥ స్వామినాథుడతడే స్వామినాథుడతడే ॥ (2)

చరణం 3కలదదుగో నాగేంద్రంబతి వినయముగన్ కలరవమే శివగురుడని ఆరాధింపన్
కలగందురు కద తండ్రులు ఈ ధన్యతకున్ కనుటకు తమ సంతానము నో శిఖరమునన్

Meaning

Pallavi — O lovely one! For your son's sake — for Shanmukha's sake, for Guha's sake — don't they come to Kattumalai, for the sake of true wisdom? O daughter of the mountain! Doesn't pride fill my heart, alas, at how charmingly he explains the Omkāra itself! — He is Swaminatha, he is Swaminatha.

Charanam 1 — Even to sages performing tapas across the yugas, even to yogis, to Devendra, to Vāṇīśa — among all who exist in this world, is even a single one of them capable of explaining the Omkāra in this way? — He is Swaminatha, he is Swaminatha.

Charanam 2 — O Goddess, behold — as fathers ascend those sixty steps together with their daughters — to worship our own splendorous son, Muruga — what other delight could remain in our minds beyond this? — He is Swaminatha, he is Swaminatha.

Charanam 3 — Doesn't even the great elephant, so humbly, amid the tumult, worship him, calling him Śivaguru! Don't fathers dream, isn't it so, of this very blessedness — of seeing their own children reach some peak!

రాయగలనా రామ!

పల్లవిరాయగలనా రామ! రాగయుక్తముగానూ?
ఛాయ నీవై నాకు సాయంబు సేయుమయ్య!

చరణం 1శ్యామ కృష్ణాయంచు సామవేదామృతమును
రామ! రామా! నేను రాగావళులు గట్టిక
॥ రాయగలనా రామ! ॥ (1)

చరణం 2త్యాగరాజాప్తుడుగ దశరథాత్మజ! రామా!
వేగ సేయుము నన్ను వేడుకొందును రామా!
॥ రాయగలనా రామ! ॥ (2)

చరణం 3గురుగుహ మనన తపో కులభాను పద పంకజ
సారము గళము జార సాకేత సార్వభౌమ!
॥ రాయగలనా రామ! ॥ (3)

చరణం 4భావయుక్తము గాను పారు కన్నీరుతోను
గావమంచును పాడ గలన కోదండ రామ!
॥ రాయగలనా రామ! ॥ (4)

చరణం 5ఏడిపించకు రామ! ఎగతాళి సేయకయ్య!
గాడినందున పెట్టి గానంబు జక్కదిద్దు
॥ రాయగలనా రామ! ॥ (5)

చరణం 6రామ! నాగేశ నుత! రాగాలు నేర్పకుండ
నామ మాత్రము నీవు నను పట్టి వీడిపోవ
॥ రాయగలనా రామ! ॥ (6)

Meaning

Pallavi — Can I write, O Rama — with rāga in it? Be my shadow, and grant me your help.

Charanam 1 — Saying "Śyāma Kṛṣṇa" — could I write the nectar of the Sāma Veda by constructing rows of rāgas, O Rama, Rama?

Charanam 2 — O son of Daśaratha, Rama! — make me swiftly one of the tyāgarājāptulu. I beg you, Rama.

Charanam 3 — O sovereign of Sāketa! — let the essence of the lotus-feet of the sun of that lineage, whose tapas was the contemplation of Guruguha, slip down into my throat.

Charanam 4 — With bhāva in it, with tears streaming — can I sing, crying "protect me," O Kodanda Rama?

Charanam 5 — Don't make me weep, Rama! Don't mock me! Put me on the track and set my singing right.

Charanam 6 — O Rama, Nāgeśa-nuta — praised by Lord Śiva! — without teaching me the rāgas, that you should hold me as a namesake alone and let me go —

Context

The first three charanams invoke the Trinity of Carnatic music — Syama Sastri, Tyagaraja and Muthuswami Dikshitar — in order, each by his mudra (the signature a composer weaves into his own compositions) rather than by name.

Charanam 1 — శ్యామ కృష్ణ. Syama Sastri's mudra. The eldest of the Trinity, he composed some three hundred kritis, mostly to Goddess Kamakshi, and alone among the three gave exceptional attention to laya, using uncommon and intricate talas. He is invoked here beside the Sāma Veda, the sung Veda from which Indian music descends.

Charanam 2 — త్యాగరాజాప్తులు. The phrase is Tyagaraja's own, from the ninth charanam of Endaro Mahanubhavulu: those who grasp the inner meaning of the scriptures and know the joy of bhāva, rāga and laya together are the ones he calls his āptulu — his own people. This keertana distributes the same triad across itself: laya assumed, rāga asked for in the pallavi, bhāva in charanam 4.

Charanam 3 — గురుగుహ. Dikshitar, addressed only through his mudra. Unlike the Telugu compositions of the other two, his are predominantly in Sanskrit, contemplative and in slower chowka kāla; accordingly this charanam alone is written in dense Sanskrit compounds. Guruguha is also a name of Subrahmanya.

జట్టు చేరి

పల్లవిజట్టు చేరి నీ సాటివాడిగాను
పట్టనివ్వు నిను పాండురంగ విఠల!

చరణం 1నొసట జారు నీ కురులను సవరించి, నుదుట పింఛయుక్త మకుటంబునమర్చి
అసమ హాసధర! నీ చుబుకము పట్టి అందము హెచ్చింప తిలకంబు దిద్దగ
॥ జట్టు చేరి ॥ (1)

చరణం 2పట్టు వస్త్రములు ధరియింపగ జేసి బంగారు నగలను గళ భుజముల బెట్టి
కట్టగ నడుముకు ఉత్తరీయంబును కలుపుకోవె నన్ను పాండురంగ విఠల!
॥ జట్టు చేరి ॥ (2)

చరణం 3కర్ణముల మకర కుండలంబులనిక గళసీమ కౌస్తుభ తులసి మాలలనిడ
పర్ణవర్ణమణిహార! సుగుణధీర! పదయుగముల చోటు నివ్వవేమి విఠల!
॥ జట్టు చేరి ॥ (3)

చరణం 4ఆటలాడ నీ జట్టు చేరనిమ్ము అడ్డుచెప్పకయ్య పాండురంగ విఠల!
మాటమాటలో ముద్దులొలుకు మోము మది నిండగ జూడ చేరనిమ్ము విఠల!
॥ జట్టు చేరి ॥ (4)

చరణం 5భక్తి హీనతను కారణంబంచును బహు దూరము పెట్టి వెలివేయక విఠల!
నక్తచరనాశ నీ సఖుడిననుకొని నాగేంద్రనుత! నా సఖుడవ్వు విఠలా!
॥ జట్టు చేరి ॥ (5)

శృంగార శ్రీరామ!

అనుపల్లవిస్వర్ణమయ వివిధ రత్న రాశీ ఖచిత సింహాసనమందు కొలువైన శ్రీరామ!
పర్ణ వర్ణ చేలాంచన ధర! సీతా మన సంచార! శృంగార శ్రీరామ!

పల్లవిఓ రామ! శుభనామ! ఘననీల శ్యామ నా
నేర మృగ వేటకై వనవాసి వైనావ?

చరణం 1నా పాప చయమిపుడు దశముఖంబులు వేయ రావణుడు కూర్చునే నా మదిని శ్రీరామ!
చాపోగ్ర తాండవాద్భుత లీల చూపు, మేని మన వాక్కుల త్రికూట జిత శ్రీరామ!
ఓ రామ!

చరణం 2దనుజ నాగేంద్ర మృగ రాజేంద్ర! రాజ నుత! రాజ రాజేంద్ర! నా స్వామి! శ్రీరామ!
వినుత నాగేశ నుత! సీతాపతీ! నిజ తారకాద్భుత నామ! సాకేత రామ!
ఓ రామ!

Meaning

Anupallavi — Seated on a golden throne embedded with a diverse array of jewels, O Sri Rama! Clothed in leaf-green garments, wandering in the heart and mind of Sita — O Srngara Sri Rama!

Pallavi — O auspicious-named Rama! O dense-cloud-hued, dark one! To hunt the stag that is my own sin, did you become a forest-dweller?

Charanam 1 — My stack of sins now shows ten heads, and Ravana himself sits enthroned in my mind, O Sri Rama! Show me the feat of your unmatched, fierce bow-dance — O Rama, victor over the trikuta of body, mind, and speech! O Rama — to hunt the stag that is my own sin, did you become a forest-dweller?

Charanam 2 — Majestic lion to the elephant-kings of the demons! Praised by kings! King of kings! My Lord, Sri Rama! Praised even by Siva, who is himself widely praised! Consort of Sita! O truly liberating, wondrous-named one — Rama of Saketa! O Rama — to hunt the stag that is my own sin, did you become a forest-dweller?

జోలాలి

జో దేవదేవేరి ! జోజోలు నారీ!
లాలి జవరాలైన పడుచు వయ్యారీ!
జో జో జో జో

క్షీరజలధిన బుట్టి నెలవంక చెల్లి, శేషశయనుడు మేఘశ్యామునితో వెళ్లి
నల్ల బుగ్గలనెర్రపరచి మైమరచి, అలసి సొలసిన బుజ్జి బంగారు కూచి..
జో జో జో జో (1)

రామచంద్రుని వెంట అడవులకు వెళ్లి, కందె నీ పాదాలు ముళ్ళ బాటల మళ్ళి
ఒడిలోన పెట్టి ఆ పాదాలు మళ్ళీ, ఒత్తుతూ పాడాలి సీతకీ లాలి..
జో జో జో జో (2)

జగతి కోరెడి చక్రి నీ కొంగు పట్టి, విడువనంటున్నాడు తను ఒట్టు పెట్టి
మాయ గోపాలుడినె మాయలో పెట్టి, రప్పించుకున్నట్టి భీష్మకుని పట్టి..
జో జో జో జో (3)

నందనంబున పారిజాతంబు కోరే, సత్యభామాదేవి రణరంగమేగె
పూవు ముట్టెడి చేత ధనువునే పట్టి, వీర శృంగారముల కలయికయ్యెడి చిట్టి..
జో జో జో జో (4)

గడుసుమాటల విభుని గుండె దాగితివి, పతికి జోకొట్టతని మతిని దోచితివి
పొడవైన వాల్జడను తిప్పి అలసితివి, సొంపైన సొగసులను మోసి సొలసితివి..
జో జో జో జో (5)

జో నీలవేణి! జోజోలు శుభతరుణి!
లాలి మంజుల వాణి! పసిడి పారాణి!
జో జో జో జో

సృజన చేసే కవికీ స్ఫురణవైనావు, కర్త నీ పతి, అతని కార్యముల కలవు
భాష నీ పతియైతె భావమే నీవు, సరస సల్లాపాల సారస్వతమువు..
జో జో జో జో (6)

జో హరుని అర్థాంగి! జోజో లతాంగీ!
జోలాలి నాగేశ హృదయాంతరంగీ!
జో జో జో జో

తాపసిని నువుకోరి తపములనొనర్చి, మంచుకొండల వాని మదిని కరిగించి
కన్నులలిసేడట్టు నీ పతిని చూచి, గరళకంఠుని హృదయ తాపంబునణచే..
జో జో జో జో (7)

జగతికర్థముకాని జంగముని కోరి, తనువునిచ్చిన తల్లితండ్రులతో పోరి
భస్మమలదిన విభుని బాహువులజేరి, ముద్దుమురిపెములాడు మాంగళ్య గౌరి..
జో జో జో జో (8)

జోలాలి జోలాలి లాలినేననగా
జారుకో నిద్రలో మా గౌరిదుర్గ!
జో జో జో జో

లాల్ సలామ్

అరుణోదయ విప్లవమని
అవనికెంతో అవసరమని
ఆర్తుల శోక ధ్వని విని
అరిచా లాల్ సలాం అని

కులం గోడ కూల్చాలని
మతం మత్తు మాన్పాలని
చీకటి తెర చీల్చాలని
అరిచా లాల్ సలాం అని

సమ న్యాయం మన హక్కని
సమసమాజ స్థాపనకని
సామ్యవాద కలలే కని
అరిచా లాల్ సలాం అని

అవినీతిని ఆపాలని
బాధ్యతనే నేర్పాలని
ప్రగతి బాట పట్టాలని
అరిచా లాల్ సలాం అని

అజ్ఞానము మాయమైన
పలు విద్యల వెలుగులోన
ప్రపంచాన్ని చూడాలని
అరిచా లాల్ సలాం అని

రాక్షస పాలన వద్దని
స్వార్థపు వ్యక్తులు చేటని
త్యాగధ్వజమెగరాలని
అరిచా లాల్ సలాం అని

పౌరుషంతో ఉరకలేసే
నా రక్తము చిందించి
లోకాన్నే కడగాలని
అరిచా లాల్ సలాం అని

మనిషికంటు విలువుందని
విలువలతో బతకాలని
మనిషికి మనిషే దిక్కని
అరిచా లాల్ సలాం అని

అస్తమించు సూర్యునిగని
ఏదీ ఆ మార్పేదని
ఇంకెప్పుడు వస్తుందని
అరిచా లాల్ సలాం అని

పగటికి రేయికి రోజని
ముప్పై రోజులు నెలకని
గడిచే ఏళ్లని కని కని
అరిచా లాల్ సలాం అని

కుడి ఎడమల తడబాటున
సాగే మనుషుల కథ గని
జగమంతా నాటకమని
అరిచా లాల్ సలాం అని

సిద్ధాంతం పునాదిగా – రాద్దాంతం లేచిందని
పక్షపాత ధోరణిలో - నిజం దాగిపోయిందని
అధికారపు దాహంలో - పోరు మాయమయ్యిందని
నాయకుడేగుంపైనా - న్యాయం జరగట్లేదని
సామాన్యునికివి ఏవీ - సమస్యలుగ కనబడవని
పల్లీ ముచ్చట్లుగ మన ఉద్యమాలు మిగిలాయని
గత చరిత్ర నేర్పించిన - గుణపాఠం మరిచామని
ప్రతిరోజూ దెబ్బతినే అలవాటే మనకుందని
స్వార్థపు సంకెళ్లే మన – చేతులకాభరణాలని
పిరికితనం బద్ధకమే - మన కాళ్ళకు చెప్పులనీ
ప్రగతివాక్య శ్రవణానికి - చెవులను మూసేసామని
నీతివాక్య పఠనానికి – వాక్కును వాడట్లేదని
న్యాయమైన విచారణకు - బుద్ధిని ఉపయోగించని
చదువుకున్న మూర్ఖులమని - పట్టాలున్న పామరులని
నిజం కనే దమ్ములేని – మన బతుకులు వ్యర్థమనీ
మంచి చేయ మనసు రాని - ప్రాణమున్న రాళ్ళమని

నా అరుపులు వ్యర్థమనీ
నా వేదన పట్టదనీ
మన బతుకులు మారవనీ
తెలిసే నే పూనుకుని
అరిచా లాల్ సలాం అని
అరిచా లాల్ సలాం అని

तराना-ए-इंसानियत

सारे जहाँ से सीखो, भारत वीर कुमारा / कुमारी
सारे जहाँ से सीखो,
हम सब का घर है धरती
कौन है भला कहने को - 'ये मेरा'? ॥ सारे जहाँ ॥

क्या फायदा हमें? बोलो, मजहब के नाम पे लड़ना
कर्म भावन अलग भी, धर्म सार तो एक है हमारा ①

ग्रंथ वाक्य बदलते हैं - धर्म तो निश्चल यारा
हम पासबाँ हैं इसकी, वो पासबाँ हमारा हमारा ②

ज्ञानी राजा राममोहनजी, ब्रह्मो समाज विचारा
दैवकुमार वचन से - प्रेम त्याग मिले जीवन सारा ③

अष्टांग मार्ग सीखो, यीवू वचन है पूरा
दारा शुकोह का रास्ता ढूंढो, चलना अवश्य काम है हमारा ④

मजहब नही सिखाता, आपस में बैर रखना
इंसान हैं हम, इंसान हैं हम, इंसान हैं हम
बरसते प्रेम से भरा विचार हमारा ⑤

सारे जहाँ से सीखो - भारत वीर कुमारा !

ख्वाहिश है मेरी

हर दिन, ख्वाहिश है मेरी,
पहुँचना तो मंजिल तेरी.

हर सपना तुझे बुलाना,
हर सपना टूट गया, ना?

हर पल तुम याद में आना,
कब रुकेगा मेरा रोना?

सच कहता हूं, मेरे जाना!
मेरा जीवन तू, मेरी सोना!

मेरे हाथ से तुझे पकड़ना,
तेरी हंसी को देखते रहना,

सिया! तुम मेरी बात को सुनलो,
राम के दिल को, तुम खुश करलो,

हर दिन, ख्वाहिश है मेरी,
पहुँचना तो मंजिल तेरी...